హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రతిఒకరి జీవితంలో చదువే ఎంతో కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక అన్నారు. ‘గిరిజన ప్రాంతాల్లో చదువు లేకపోవడంతో చిన్నచూపు చూశారు.. మనల్ని అక్షరానికి దూరం చేశారు.. అనాగరికులమని ముద్ర వేశారు.. ఇపుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రైవేటు విద్యార్థులతో పోటీగా గిరిజన గురుకులాల్లోని విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధిస్తున్నారు’ అని సీతక్క పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన గురుకుల విద్యార్థులకు బుధవారం బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం ఆదివాసీభవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిక్స్సక్సెస్ మీట్-2025లో ఆమె ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందనలు తెలిపారు.
గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆదివాసీ గిరిజన పెయింటింగ్స్‌తో రూపొందించిన చీరను సీతకకు బహూకరించారు. అనంతరం స్టేట్ ర్యాంకర్స్తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కే తిరుపతి, గిరిజనశాఖ కార్యదర్శి శరత్, గిరిజన గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన కోయ, ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.