హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తేతెలంగాణ): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం ప్రతి ఒకరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క కొనియాడారు. ఆ మహనీయుడు బోధించిన అహింస, సమానత్వ భావనను అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్లో సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి ఆమె సేవాలాల్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బంజారాల భాషకు అధికారిక గుర్తింపు కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సేవాలాల్ జీవిత విశేషాలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, విప్ రామచంద్రు నాయక్, వ్యవసాయ కమిషన్ మెంబర్ రాములునాయక్, మాజీ ఎంపీలు రవీందర్‌నాయక్, వీ హనుమంతరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.