మహబూబాబాద్ : ఆడబిడ్డలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మార్కెట్ యార్డులో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations భాగంగా నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. త్వరలో గృహలక్ష్మి(Gruhalaxmi) పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు మూడులక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారని వివరించారు.మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులనూ పెంచిందని గుర్తు చేశారు.గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నదన్నారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospital)గతంలో 30 శాతం ఉన్న ప్రసవాలు 60 శాతానికి పెరిగాయని తెలిపారు. మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ సుహాసిని, డాక్టర్ సీతాలక్ష్మి, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీలు, ప్రియాంక, శ్రీనాథ్, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.