అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, శిశువుల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వివరించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా నిర్వహించుకుంటున్నామని, ఈ వేడుకల్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు.
ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ లో మహిళల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక కేటాయింపులు చేసి ప్రాధాన్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీశ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మహిళలకు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు పెట్టి మహిళా బంధు గా నిలిచిన సీఎం కేసిఆర్… ఈ బడ్జెట్ లో మహిళా విశ్వ విద్యాలయం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షనీయమని అన్నారు. వీటితో పాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలలో రక్త హీనత తో బాధ పడుతున్న మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం 1,25,000 మందికి లబ్ది చేకూరే విధంగా కేసిఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా మహిళల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మంత్రి హరీష్ ప్రేమకి నిదర్శనమని అన్నారు. ఇందుకు వారికి మహిళల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో, చిన్న తరహా పరిశ్రమలు పెట్టడంలో మహిళలను ప్రోత్సహించడం కోసం వారికి పావలా వడ్డీ కి రుణాలు ఇవ్వాలని నిర్ణయించి 187 కోట్లు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 8673 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 10.26 లక్షల మందికి లబ్ది చేకూర్చారని, ఈ బడ్జెట్ లో ఈ పథకానికి 2750 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ఆడపిల్లల మేనమామగా ముఖ్యమంత్రి కేసిఆర్ చిర్థాయిగా నిలిచిపోతారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.