మోర్తాడ్, జనవరి 31: ‘తెలంగాణలో లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం. ఇంతకన్నా ఒక్క ఉద్యోగమైనా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇచ్చారా? ఇస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా?’ అని బండి సంజయ్‌కు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటం కాదని, మోదీ చెప్పినట్టు ఏడేండ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేకపోతే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టాలని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో మోదీ ఇచ్చిన మాటపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రాన్ని నిలదీయాలని తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్‌లో మాట్లాడుతూ రాష్ర్టాన్ని కేంద్రం శత్రువులా చూస్తున్నదని విమర్శించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న.. బయ్యారం ఉక్కు ఫ్యా క్టరీ, గిరిజన యూనివర్శిటీ, జీఎస్టీపై రావాల్సిన రూ.3 వేల కోట్లు ఏవని అడిగితే కక్షగట్టిందని తెలిపారు. ఇవ్వాల్సిన నిధులే ఇవ్వకుండా తెలంగాణ ద్రోహిగా మారిందని అన్నారు. మన రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బాపురావు, ధర్మపురి అర్వింద్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడేండ్లుగా తెలంగాణకు రావాల్సిన వాటిని ఎందుకు అడగలేకపోతున్నారని నిలదీశారు.
కేసీఆర్ గురించి ఎక్కువ మాట్లాడితే ఉరికిపిస్తరు
తండ్రి వయసున్న కేసీఆర్ గురించి అవాకులు-చెవాకులు పేలితే ప్రజలు ఊరుకోరని తప్పకుండా ఉరికిస్తారని మంత్రి వేముల హెచ్చరించారు. అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని అర్వింద్‌ను డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి మోర్తాడ్‌కు ఏం తెచ్చావో చెప్పాలని ప్రశ్నించారు.