Ponnam Prabhakar | తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కొత్త పాస్‌లు ఇవ్వకుండా.. ఇంకా పాత పాస్‌లతోనే అనుమతించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీకి వచ్చిన పలువురు జర్నలిస్టుల అసెంబ్లీ పాస్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వారి దగ్గర పాత పాస్‌లే ఉండటం ఆయన గమనించారు. దీంతో ఈ విషయంపై అసెంబ్లీ సెక్రటరీ మీద పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇంకా పాత కార్డులనే కొనసాగించడమేంటని ప్రశ్నించారు. కొత్త పాస్‌లు ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సంక్షేమం, సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులకు రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.వరి రైతులకు పంట బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.