వేములవాడ, జనవరి 27: జిల్లాలను తొలగించడం లేదని, అది అసత్య ప్రచారమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలకు సాంకేతిక హద్దులు మాత్రమే మారుతాయని స్పష్టంచేశారు. రిటైర్డ్ జడ్జితో ఇప్పటికే కమిటీ వేశామని, అది కూడా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే ఉంటుందని తెలిపారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
వేములవాడ పట్టణానికి అమృత్ పథకం ఇస్తే స్వాగతిస్తామని అన్నారు. బీజేపీని ఉద్దేశిస్తూ.. 12 ఏండ్లుగా వేములవాడకు ఎందుకు అమృతం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లు పొందాక కొంతమంది నాయకులకు వేములవాడ ఉందన్న విషయం కూడా జ్ఞాపకం లేదని విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా మాత్రమే హామీ ఇస్తే అది పొరపాటే అవుతుందని చురకలంటించారు. వేములవాడ అభివృద్ధిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కోరుకున్నామని చెప్పారు. ప్రభుత్వంలోకి రాగానే మొత్తం క్యాబినెట్ మంత్రులంతా వచ్చి వేములవాడ అభివృద్ధికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు.