హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణాశాఖలో ఎన్ఫోర్స్మెంట్ ఆదాయాన్ని మరింత పెంచాలని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం పెట్టుకున్న లక్ష్యాలను సాధించిన అధికారులను మంత్రి అభినందించారు. మంగళవారం సచివాలయంలో రవాణాశాఖ అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. 2024-25లో రూ.6,910.90 కోట్ల ఆదాయం వసూలు కాగా, 2025-26లో రూ.7,097.38 కోట్లు వసూలైనట్టు అధికారులు తెలిపారు. ఈవీ పాలసీ ద్వారా కొంతమేర ఆదాయం తగ్గినట్టు వెల్లడించారు.
సారథి పోర్టల్ ప్రారంభించుకున్న 8 నెలల్లోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి పొన్నం వెల్లడించారు. వాహన పోర్టల్ డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ‘జూన్ 1కి ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలి. ఏఎంవీఐలకు ఇచ్చిన శిక్షణ మాదిరిగానే రవాణాశాఖ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి రహవీర్ సీమ్, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 13-18 మధ్యలో ఉమ్మడి జిల్లాల్లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి’ అని సూచించారు. స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీలు చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య, రమేశ్, డీటీసీలు, డీటీవోలు, ఆర్టీవోలు, ఏంవీఐలు పాల్గొన్నారు.