తిరుమలాయపాలెం, జూలై 15: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అత్యవసరమని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం ముఖ్యమంత్రి, మంత్రులతో మాట్లాడి పంచాయతీలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఖమ్మం తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో కొద్దిరోజులుగా ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతుండటంతో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి సోమవారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. కాలనీల్లో కలియదిరిగి అపరిశుభ్ర వీధులను పరిశీలించారు.
జ్వర పీడితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం గ్రామాల్లోని ప్రజలందరికీ అండగా ఉంటుందని అన్నారు. జల్లేపల్లిలో జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.