హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి పటిష్ట విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై తాసీల్దార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 33 జిల్లాల తాసీల్దార్లతో షామీర్పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఆదివారం ముఖాముఖి కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని, ఒక అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాసీల్దార్లపై కేసులు నమోదు చేయాలంటే ఇకపై ముందస్తుగా కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని, ఆ దిశగా డీజీపీతో చర్చించి త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన, బదిలీలు తదితర సమస్యలను పరిషరిస్తామని హామీ ఇ చ్చారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, మేడ్చల్-మలాజ్‌గిరి కలెక్టర్ గౌతమ్పొత్రు, తాసీల్దార్లు పాల్గొన్నారు.