ఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల హామీలను ఆర్థి క వెసులుబాటు చూసుకొని దశలవారీగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పిన రూ.2,500, యువతులకు పెళ్లి సమయంలో ఇచ్చే తులం బంగారం, విద్యార్థులకు ద్విచక్ర వాహనాలను సైతం విడతల వారీగా ఇస్తామని వెల్లడించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయనున్నట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం పత్రికల్లో చూశామని, విచారణకు ఆ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంక్రాంతి సెలవుల తర్వాత అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28లోగా భూ భారతిని అమలులోకి తెస్తామని చెప్పారు.