హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇసుక అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆన్లైన్లో ఇసుక అమ్మకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న ఇసుక పాలసీ దేశంలోనే ఉత్తమమైనదని చెప్పారు.
రాష్ట్ర గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధిస్తున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,267 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటికే రూ.3,884 కోట్లు సమకూరిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని, కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 101 రీచ్‌ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, టీఎస్ఎండీసీ ద్వారా సాధ్యమైనంత ఎకువ ఇసుక రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తవ్వకాలకు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టులను భర్తీ చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాంకేతికతను అనుసంధానం చేసి గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గనులశాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.