హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం వల్ల విద్యార్థులు సష్టపోతున్నారని దీన్ని ఏమాత్రం సహించేది లేదని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్సీ భవన్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గురుకుల ప్రవేశాల కోసం వచ్చిన తల్లిదండ్రుల నుంచి ఆయన స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను ఓపికగా విన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని, సహకరించడం లేదని తల్లిదండ్రులు తెలుపగా ఆయన ఆధికారులపై అసహనం వ్యక్తంచేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వారి నివాసానికి అనుకూలమైన జిల్లాల్లో సీట్లు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎస్సీ సంక్షేమశాఖకు సంబంధించి రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి తక్షణం రూ.150 కోట్ల్లు విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలెను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని బుధవారం బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.