హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.
వరంగల్‌తోపాటు ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్ టిమ్స్ దవాఖానల నిర్మాణాలపై చర్చించారు. వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నిర్మాణంలో వేగం పెంచాలని, ఎక్కువమంది కార్మికులను నియమించుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 22న వరంగల్ దవాఖాన పనులను పరిశీలించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానల పురోగతిని తెలుసుకున్నారు. ఎల్బీనగర్లో చేపట్టిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు ఈ నెల 26కల్లా ప్రారంభం కావాలని, ఆ రోజున తాను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని పేర్కొన్నారు. అల్వాల్‌లో చేపట్టిన 1200 పడకల దవాఖాన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సనత్‌నగర్ దవాఖాన స్ట్రక్చరల్ డిజైన్లను పరిశీలించారు. ఈ నెల 29 న అల్వాల్, సనత్‌నగర్ దవాఖానల నిర్మాణ సైట్లను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సమీక్షలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, హఫీజ్, నాగేందర్రావు, ఈఈ నర్సింగరావు పాల్గొన్నారు.