
నాగర్‌కర్నూల్ : ఏడాది లోగా వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజినేపల్లి మండలం పాలెంలో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ హాస్టల్‌ను, తిమ్మాజిపేటలో సూపర్ మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పీఏసీఎస్ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయన్నారు. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం కేసీఆర్.. ఆ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. కరెంటు రాలేదనే మాటలు ఎక్కడా వినిపించడం లేదు. ఉద్యమంలో సంబంధం లేని, ఆంధ్రోళ్లకు గులాంగిరీ చేసినోళ్లు సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తరా అని నిప్పులు చెరిగారు.
వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించిందని పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించామని తెలిపారు. పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో పత్తి సాగు పెంచాలి అని సూచించారు. యాసంగిలో వరి శ్రేయస్కరం కాదు అని చెప్పారు. వ్యవసాయ పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, జెడ్పీ ఛైర్మన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాష, డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, ప్రజాపతినిధులు పాల్గొన్నారు.