వనపర్తి, మార్చి 2: ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ ఆధారిత సంస్థ సిన్జెంటా సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక గ్రామీణ వేసైడ్ మార్కెట్‌ను ప్రారంభించింది. దాదాపు 51 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మించింది. అతి పెద్ద ఈ మార్కెట్ దాదాపు 20 వేల మంది రైతులు, 30 గ్రామాల ప్రజల అవసరాలను తీర్చనున్నది. రైతులు మెరుగైన దిగుబడులు సాధించడంతోపాటు పంట పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందించనున్నది. ఈ మార్కెట్ ఆవరణలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా 78 ప్లాట్‌ఫామ్‌లు, షెడ్లు ఏర్పాటు చేశారు.
విద్యుత్తు, పార్కింగ్, టాయిలెట్లు, పిల్లల ఆటస్థలం, మంచినీటి నల్లాలు, వ్యర్థాల నిర్వహణ, తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూం, క్యాంటీన్ తదితర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం విశేషం. వనపర్తి మెడికల్ కాలేజీ సమీపంలోని ఈ మార్కెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సిన్జెంటా సంస్థ గ్లోబల్ సీఈవో ఎరిక్ ఫైర్‌వాల్డ్ గురువారం సందర్శించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యంతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సిన్జెంటా సంస్థ దేశవ్యాప్తంగా 24 వేసైడ్ మార్కెట్లను ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలో తొలి వేసైడ్ మార్కెట్‌ను వనపర్తిలో నిర్మించడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు.
మార్కెట్‌కు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, పిల్లలను చూసుకునేందుకు ఆయా, ఆట వస్తువులు, క్యాంటీన్ సైతం అందుబాటులో ఉంటాయని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. వనపర్తిలోని తొలి మహిళా వ్యవసాయ కళాశాలకు త్వరలోనే సొంత భవనం నిర్మిస్తామని తెలిపారు. సిన్జెంటా సీఈవో ఎరిక్ ఫైర్‌వాల్డ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదర్శవంతమైన మార్కెట్ నిర్మించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి అందించిన సహకారం ఎనలేనిదని కొనియాడారు. అనంతరం సిన్జెంటా సంస్థ సభ్యులను మంత్రి నిరంజన్‌రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, సిన్జెంటా సంస్థ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.