హైదరాబాద్ : ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 3 వరకు అమెరికాలో పర్యటించనుంది. మంత్రి బృందం 29 నుంచి 31 వరకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరవుతారు. అమెరికాలో ప్రముఖ వ్యవసాయిక రాష్ట్రం లోవా, నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అనంతరం అమెరికా ఫెడరల్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, అమెరికా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు.
ఈ పర్యటన తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేయనున్నది. భవిష్యత్లో ఆహార పరిశ్రమలతో రైతులకు వ్యవసాయం మరింత లాభసాటి చేసే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కార్యాచరణను ముమ్మరం చేసింది.