హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రైతు ముఖంలో శాశ్వత చిరునవ్వును చూడటమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కొనసాగింపుతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ పూర్తయిందని అన్నారు. ఇటీవల కురిసిన వానల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైతుల స్థితిగతులు, వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధి, తదితర అంశాలపై మంత్రి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రుణమాఫీపై రైతులు ఏమంటున్నారు?
అద్భుతంగా ఉందంటున్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమతి అని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. రైతుమోమున శాశ్వత చిరునవ్వును ఉంచటమే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు అత్యంత ప్రీతీపాత్రమైంది.
రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తవుతుంది?
రైతులకు మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిచేశాం. ఈ ప్రక్రియ వచ్చేనెల రెండోవారం కల్లా పూర్తవుతుంది. ప్రస్తుతం 31.91 లక్షల మందికి దాదాపు 19వేల కోట్లు మాఫీ కానున్నాయి.
వ్యవసాయ చర్యలను వివరిస్తారా?
మిషన్ కాకతీయ మొదలుకొని పాతప్రాజెక్టులను పూర్తిచేయటం, కొత్త ప్రాజెక్టులను నిర్మించటం, రైతుకు అవసరమైన కరెంట్ సౌకర్యాన్ని కల్పించటం, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచటం, రైతుబంధు, రైతుబీమా వంటి వినూత్న ఆలోచనల ద్వారా ఒక చైన్ ఆఫ్ యాక్షన్‌ను పూర్తి చేశాం. ఇలా చేయటం వల్ల వ్యవసాయం ఆర్థికపురోభివృద్ధి సాధించి ముందుకు సాగుతున్నది.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఎంతవరకు వచ్చింది?
మా ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుచేశాం. చాలాచోట్ల కొత్త యూనిట్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అవి మరింత వేగాన్ని అందుకుంటాయి. ఆయిల్ ఫ్యాక్టరీలు, ఎడిబుల్ ఆయిల్, పల్సెస్ యూనిట్స్, మాడ్రన్ రైస్‌మిల్స్, రాబోయే రోజుల్లో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. కూరగాయలు, పండ్లకు సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తున్నాయి.
రుణమాఫీ ఎన్నికల స్టంట్ అంటున్న విపక్షాలకు మీ సమాధానం?
రైతుబంధు 2018లో ప్రారంభించినప్పుడు ఏ ఎన్నికలున్నాయి? అప్పుడూ అదే అన్నరు. ఇప్పటికి 11 విడతలుగా రైతుబంధు ఇచ్చినం. విపక్షాలు ఏమంటారు అన్నది మాకు ప్రామాణికం కాదు. మేం ఇవ్వదలచుకున్నాం. ఇస్తాం. ఎన్నికల కోసం మాట్లాడటం, ఎన్నికల కోసమే పనిచేయటం కాంగ్రెస్ విధానం. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసే పనులు, పథకాలు కాంగ్రెస్ పార్టీకి కలలో కూడా రావు. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవి, వాగ్దానం చేయకపోయినా ప్రజాభ్యున్నతి కోసం మేం ముందు చూపుతో ఆలోచించి వాటిని అమలు చేస్తున్నాం.
పాలమూరు-రంగారెడ్డి పరిస్థితి ఏమిటి?
ఎన్నికలతో సంబంధం లేకుండానే పాలమూరు నీళ్లు వస్తాయి. ఈ విషయంలో మా పాలమూరు రైతులకు స్పష్టత ఉన్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతమంది రాజకీయ పక్షులు, మేధావులు రకరకాలుగా మాట్లాడుతున్నరు. ఆ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో వృత్తులు పునరుజ్జీవం అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీవనచక్రం అద్భుతంగా రూపాంతరం చెందుతుంది.
ఇటీవలి వర్షాల వల్ల నష్టం ఎంత?
ఈ సారి 14 రోజులు ఆలస్యంగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ కురిశాయి. మరికొన్ని చోట్ల అధిక వర్షాలు కురిశాయి. ఈ వానలకు వానకాలం పంట తీవ్రంగా నష్టపోలేదు. కొన్ని ప్రాంతాల్లో పత్తి నష్టపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు నీటమునిగాయి. పంట నష్టం తీవ్రతను క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తున్నాం.
ఫసల్‌బీమా యోజనపై మీ సమాధానం?
కేంద్రం తెచ్చిన ఫసల్‌బీమా యోజనతో రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదని అనేక రాష్ర్టాలు ఆ పథకం నుంచి వైదొలిగాయి. ప్రధా ని సొంత రాష్ట్రమైన గుజరాతే వెళ్లిపోయింది. దీంతో దేశానికి ఏ సంకేతం వెళ్లింది? అందు కే ఈ దేశానికి కావాలసిన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా కేంద్రం గ్రహించాలి.
పంటల బీమా అసాధ్యమేనా?
ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తిస్థాయిలో పనిచేయలేవని తేలిపోయిన తరువాత.. ఆ గ్యాప్‌లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యతాయుత స్థానంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఆ అంతరాన్ని పూడ్చేందుకు సమగ్ర బీమా విధానాన్ని రూపొందించాలి. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవాలన్న స్పృహతో భారతప్రభత్వమే బీమా కంపెనీలతో కలిసి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నది.
ధాన్యం ఎగుమతులపై ఏమంటారు?
తెలంగాణకు ఒక విధానం ఉన్నది. ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సాగు విధానం అంటూ లేదు. ఏ రాష్ట్రంలో ఏ పంట పండుతుంది? దిగుమతి ఎంత? ఆ పంటను ఎక్కడ వినియోగించాలి? అన్న విధానమే దేశానికే లేదు. సమన్వయం చేయాల్సిన కేంద్రం తన పని తాను చేయటం లేదు.
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి
హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): రైతుబీమా నూతన దరఖాస్తులను వెంటనే అప్లోడ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల డీఏవో, డీహెచ్‌ఎస్‌వో, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను మరింత ప్రోత్సహించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటల సాగు వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలని చెప్పారు. వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెప్టెంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నదని వివరించారు. ఈ సీజన్‌కు సరిపడ ఎరువులు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని మంత్రి తెలిపారు. సమావేశంలో వ్యవసా య కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, ఏడీడీ విజయ్ కుమార్ , ఉద్యానశాఖ జేడీ సరోజిని పాల్గొన్నారు.
విజయ నుంచి నాణ్యమైన వంటనూనెలు
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విజయ వంట నూనెలను మరింత నాణ్యతతో, అధునాతత ప్యాకింగ్‌తో ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెగా ఆయిల్ ప్యాకింగ్ కర్మాగారం నిర్మాణానికి గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తున్నదని తెలిపారు. ప్రజల నుండి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబందించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామని చెప్పారు. రాబోయే రోజుల్లో అధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు మంచి నాణ్యమైన వంట నూనెలను ప్రజలకు అందిస్తామని వివరించారు. ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించిన వర్సిటీ స్థలంలో రూ.25 కోట్లతో అత్యంత అధునాతనమైన మెగా ప్యాకింగ్ కేంద్రం, తాగునీటి కర్మాగారాలను 2024 జనవరిలోగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ, జీఎం తదితరులు పాల్గొన్నారు.