హైదరాబాద్ : పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువలు ఉండాలి. వానాకాలం, యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..డిస్ట్రిబ్యూటరీ 5, డిస్ట్రిబ్యూటరీ 8 కాలువలను రీడిజైన్ చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు.
కల్వకుర్తి కాలువ ప్యాకేజీ 29 కింద ఉన్న డి1, డి3, డి5, డి6, డి8 కాలువల పెండింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ 5, డిస్ట్రిబ్యూటరీ 8 కాలువల మీద గతంలో ఎదురైన ఇబ్బందులు మళ్లీ రాకుండా చూడాలన్నారు.
డిస్ట్రిబ్యూటరీ 5 కాలువ వెడల్పు చేసి చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలి. డిస్ట్రిబ్యూటరీ 8లో పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువ రీ డిజైన్, లైనింగ్ చేయాలని సూచించారు. చెరువులు అన్నింటికీ కాలువలను అనుసంధానం చేయాలి. చెరువులను పటిష్టం చేయాలని పేర్కొన్నారు.కాలువల నిర్వహణ దృష్ట్యా ప్రతి కాలువ మీద ఇంజినీర్లకు విధులు అప్పగించాలి.
మామిడిమాడ రిజర్వాయర్ లో 30 శాతం మేర నీళ్లు నింపాలి. ఆయకట్టుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణపసముద్రం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గణపసముద్రం, బుద్దారం రిజర్వాయర్ లైన్ అలైట్ మెంట్ పూర్తిచెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రఘునాధరావు, ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈలు వెంకట్ రెడ్డి, మధుసూధన్ రావు తదితరులు, పాల్గొన్నారు.