హైదరాబాద్: వచ్చే నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) ఆదేశించారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను జూన్ 15 నాటికి అందుబాటులో ఉంచాలని సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సీజన్ ముందే ప్రారంభమవుతుందని, దీంతో పక్కా ప్రణాళికతో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం ఎరువుల సరఫరాపై హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరతను సాకుగా చూపి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఎరువుల సరఫరాను జాప్యం చేస్తున్నదని తెలిపారు. ఇది ఏమాత్రం సముచితం కాదన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాశామని మంత్రి చెప్పారు. వివిధ పోర్టుల్లో అందుబాటులో ఉన్న డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను రాష్ట్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వానాకాలానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిందని వెల్లడించారు. దీనికి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇందులో 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపీ, ఎస్ఎస్పీ ఉన్నాయన్నారు.
రైతులు ఎరువులు మూస పద్ధతిలో కాకుండా పంటకు అవసరమైన మేరకు, నేలలో పోషకాల లభ్యతను బట్టి
వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నేల ఆరోగ్యం మీద రైతులు శ్రద్దుపెట్టాలని, ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలిలని సూచించారు.
సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించేలా ఫెర్టిసైడ్ కంపెనీలు భాద్యత తీసుకోవాలని చెప్పారు. మే నెలలో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.