హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రైతుబంధుపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఊహాజనిత కథనాలు రాస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ కథనాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో విడత రైతుబంధు నిధులను డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిందని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా రోజూ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 4 ఎకరాల వరకు ఉన్న 54,70, 637 మంది రైతుల ఖాతాల్లో రూ.4,327.93 కోట్లు జమ చేశామని చెప్పారు. కానీ.. రైతుబంధు పంపిణీ ప్రారంభించి 8 రోజులు అయినందున ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడాల్సిందే అని ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం రాసిందని పేర్కొన్నారు. ఊహాత్మక కథనంతో రైతులను గందరగోళానికి గురిచేసిందని మండిపడ్డారు. ఇది దురదృష్టకరమని చెప్పారు. 8 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమచేసినట్టు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఏ రోజు.. ఎంత విస్తీర్ణంలోని.. ఎంత మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామో స్పష్టంగా ప్రకటన విడుదల చేస్తున్నామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. నిధుల కొరత ఉన్నా..కేంద్రం వివిధ రకాలుగా తెలంగాణ పథకాలను అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. కరోనా విపత్తు వచ్చినా.. 9 విడతలుగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. అరకొర సమాచారం, ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న అత్యుత్సాహం సరికాదని హితవు పలికారు.