హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): గతంలో ఎప్పుడూ లేని విధంగా భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మర్రిగూడెం మండలం శివన్నగూడెం, కమ్మగూడ, దేవరభీమనపల్లి వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసించారు.
ఎవరో ఒకరు త్యాగం చేయనిదే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేమని చెప్పారు. శివన్నగూడెం నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో 2014కు ముందు 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా ప్రశాంతంగా బతకలేదని ఆనాటి గడ్డురోజులను గుర్తుచేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్-1గా నిలిచిందని, దేశానికి అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.