హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘నాడు రైతులపై తూటాలు పేల్చి.. నేడు సభలు నిర్వహిస్తారా? తెలంగాణ వ్యవసాయాన్ని, రైతులను నాశనం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తారా?’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి బహిరంగలేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగానికి ఒరిగింది శూన్యమని చెప్పారు. పండించిన పంటను కొనాలని, బకాయిలు చెల్లించాలని నిలదీసిన ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపిన కర్కశ పాలన కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారు.
ముదిగొండలో ఇండ్ల పట్టాలు అడిగిన పేదలపై కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రైతులను పొట్టన పెట్టుకున్నందుకు ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతారా? అని మండిపడ్డారు. రక్తకన్నీరు పెట్టించిన కాంగ్రెస్‌ను తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడని స్పష్టంచేశారు.
వరిధాన్యం కొనుగోలుపై మోదీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘వ్యవసాయంపై, రైతుల కష్టాలపై రాహుల్‌గాంధీకి ఉన్న అవగాహన ఏమిటి? రాహుల్‌గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే అదొక వింత కాదా?’. ఈ రోజు తెలంగాణ విధానాలను దేశం స్వాగతిస్తూ, స్వీకరిస్తున్నది. తెలంగాణ చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాలను దేశం ఆదర్శంగా తీసుకుంటున్నది’అని గుర్తుచేశారు.