Telangana | తెలంగాణకు వస్తా.. అక్కడి వ్యవసాయ ప్రగతిని చూస్తా.. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని ఉన్నది. మానవాళిని ప్రభావితం చేసినవిగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) గుర్తించిన 20 బృహత్ పథకాల్లో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఉండటం గొప్ప విషయం.
– ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు వస్తా.. అక్కడి వ్యవసాయ ప్రగతిని చూస్తా.. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని ఉన్నది’ అని భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ తన ఆకాంక్షను వ్యక్తంచేశారు. ఆరోగ్యం కుదుటపడగానే తెలంగాణకు వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. బుధవారం చెన్నైలోని ఆయన స్వగృహంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన విజయాలను ఆయనకు మంత్రి వివరించారు. తనకు అన్ని విషయాలు తనకు తెలుసునని, తాను గతంలో ఎఫ్ఏవో చైర్మన్‌గా పనిచేశానని పేర్కొన్నారు.
నా జన్మకు సార్థకత: మంత్రి నిరంజన్‌రెడ్డి
98 ఏండ్ల వయసులో స్వయంగా తాను తెలంగాణకు వస్తానని ప్రొఫెసర్ స్వామినాథన్ చెప్పడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రిగా ఆయనను కలవడమే తన అదృష్టంగా, ఈ జన్మకు లభించిన సార్థకతగా భావిస్తున్నానని చెప్పారు. అనంతరం ఈ బృందం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను సందర్శించింది. పర్యటనలో మంత్రితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.
Niranjanreddy