వనపర్తి : వాల్మీకులు(Valmiki) రాజకీయంగా ఎదగాలి. వాల్మీకుల అంశాన్ని మొట్టమొదటగా 2007 అక్టోబర్07 వ తేదీన వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్దృష్టికి తీసుకుని వచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Nimrajan Reddy )అన్నారు. గురువారం వాల్మీకులతో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రి నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకులు ఆంధ్రలో ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా ఎలా ఉంటారన్నారు. మనం వీరిని కూడా తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పామన్నారు. అయితే రాజకీయపరంగా కులాన్ని తీసివేయలన్నా , కలపాలన్న కేంద్రం చేతిలో అధికారం ఉంటుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశారు.
అధ్యయనం చేయడానికి ఇంకా సమయం కావాలి అని చెబితే మళ్లీ సమయం పెంచారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని రాష్ట్రం ప్రభుత్వం చట్ట సభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రంలో చలనం లేదని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో అట్లాగే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కొట్లాడుదామన్నారు.