మేడ్చల్ / శామీర్‌పేట / ఘటకేసర్ రూరల్/ బోడుప్పల్: అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని కార్మిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌లో గ్రామ రజక సంఘం ఆత్మీయ సమ్మేళనం, బోడుప్పల్ ఆకృతి టౌన్షిప్లో కార్పొరేటర్ పులకండ్ల హేమలత జంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంతోపాటు శామీర్‌పేటలో నిర్వహించిన మేడ్చల్ జిల్లా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, కులాలను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని చెప్పారు. పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా కులవృత్తులను బలోపేతం చేశారని వివరించారు. ఒకప్పుడు ఉపాధి కరువై వలస వెళ్లినవారు బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో స్థానికంగా ఉపాధి పొందుతున్నారని, ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారని తెలిపారు.
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ను ఎన్నికల్లో మట్టి కరిపించాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి అధికారం అప్పజెప్పితే మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ మాయం అవుతాయని, అవినీతి, అరాచకాలు పెరిగిపోతాయని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులను సైతం వెచ్చించానని తెలిపారు. అలియాబాద్‌లో పద్మశాలి సంఘం అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు రక్షణ కల్పించామని చెప్పారు.