రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించి.. పలు కుటుంబాలను పరామర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చేరుకున్న మంత్రి.. ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు మనుమడు సద్యోహిత్రావు బారసాలకు హాజరయ్యారు. అక్కడి నుంచి ఆవునూరుకు చేరుకొని జడ్పీటీసీ నర్సయ్య తల్లి ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన పీఏ మహేందర్‌రెడ్డి సోదరుడు ఇటీవలే మృతిచెందగా.. కొండాపూర్ వెళ్లి మహేందర్‌రెడ్డిని ఓదార్చారు. గంభీరావుపేటలో పార్టీ నాయకుడు లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, ముస్తాఫానగర్‌లో సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్‌ను పరామర్శించి అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన వివిధ మండలాల టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు మంత్రిని కలువగా వారిని అభినందించారు. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సిద్ధార్థ్‌కు మెరుగైన చికిత్స చేయించాలని అతని తల్లిదండ్రులు మంత్రిని కలిసి విన్నవించగా వెంటనే బాలుడిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నెబ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ తదితరులు ఉన్నారు.