హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కాలికి స్వల్ప గాయమైంది. మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతిభవన్ నుంచి బయలుదేరుతుండగా కాలు మెలిక పడింది. నొప్పితోనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వర్సిటీ ప్రాంగణమంతా కలియ తిరిగారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో కలిసి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు.
అయితే, కాలు నొప్పి పెరగడంతో దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకొన్నారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు ఎడమకాలి చీలమండ (యాంకిల్ లిగ్మెంట్)లో చీరిక ఏర్పడినట్టు గుర్తించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన కాలికి గాయమైన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ఏదైనా మంచి ఓటీటీ షో ఉంటే చెప్పండంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి: హరీశ్, మంత్రులు
మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ‘గెట్వెల్ సూన్ రామ్.. హావ్ ఏ స్పీడీ రికవరీ’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.