IT Annual Report | రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల 396 ఉద్యోగాలుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 9 లక్షల 5 వేల 715కు చేరుకొన్నది. ఐటీలో బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ నిలబడింది. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, ప్రోత్సాహకాల ఫలితంగా అన్ని సూచీల్లోనూ జాతీయ సగటును దాటుకొని మన ఐటీ వేగంగా దూసుకుపోతున్నది. రెండేండ్లపాటు కరోనా సంక్షోభం కమ్మేసినా, కేంద్రం సహాయ నిరాకరణ చేసినా.. ఐటీ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించడం గొప్ప విషయం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా దూసుకుపోతున్న తెలంగాణ.. తొమ్మిదేండ్లలోనే ఐటీ ఎగుమతుల్లో రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో భారత్ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి సాధించిందని తెలిపారు. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేల కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 2.41 లక్షల కోట్లకు చేరుకొన్నామని వివరించారు. 2022-23లో ఐటీ ఉద్యోగాల్లో 16.29 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.
2021-22లో ఐటీ రంగంలో 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాలుంటే 2022-23 వరకు 9 లక్షల 5 వేల 715కు పెరిగాయని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు. సోమవారం టీ హబ్ వేదికగా 2022-23 ఐటీ శాఖ వార్షిక నివేదికను ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి, నాస్కామ్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, విసెజ్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీనివాస్ కలిగొట్ల, ఎస్టీపీఐ జాయింట్ డైరెక్టర్ భరత్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని, ఈ రంగంలో తొమ్మిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు.
ఐటీ రంగానికి సంబంధించి రాష్ట్ర సర్కారు ఎన్నో పాలసీలు, ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందని, దాని ఫలితంగానే కేవలం తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల 396 ఉద్యోగాలుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 9 లక్షల 5 వేల 715కు చేరుకొన్నదని వివరించారు. అంటే ఐటీ సెక్టార్లో తొమ్మిదేండ్లలో కొత్తగా 5 లక్షల 82 వేల 319 ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు. దేశంలో కొత్తగా వచ్చే రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే ఉందని, తెలంగాణ ఐటీ రంగం ఎగుమతుల్లో జాతీయ సగటును మించి మూడున్నర రెట్ల వేగంతో దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా టీ హబ్-2ను ప్రారంభించుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీ-హబ్ 5,82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకొన్నట్టు వెల్లడించారు. దీని ద్వారా హైదరాబాద్ వేదికగా 2 వేల స్టార్టప్స్ పనిచేసేందుకు అవకాశం లభించిందని వెల్లడించారు.
Ktr1
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు
ఐటీ రంగం తర్వాత రాష్ర్టానికి ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో రూ.38 వేల కోట్ల పెట్టుబడులు రాగా, వాటి ద్వారా 31 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో రూ. 9,500 కోట్లతో అమరరాజా లిథియం అయాన్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నదని, 4,500 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. కొంగరకలాన్‌లో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ 500 మిలియన్ డాలర్లతో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఈ కంపెనీలో ఉత్పత్తి ప్రారంభమైతే సుమారు లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ (ఈ ప్రిక్స్ హైదరాబాద్)ను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు. అదే సమయంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలతో ఈవీ వీక్‌ను ఘనంగా నిర్వహించినట్టు చెప్పారు. తయారీ రంగానికి సంబంధించిన నమూనాలు తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ వర్క్స్ పేరుతో ఒక ప్రత్యేక కేంద్రాన్ని టీ హబ్ పక్కనే ఏర్పాటు చేసిందని తెలిపారు. దీన్ని ఫాక్స్‌కాన్ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించామని చెప్పారు. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టీ వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాయని తెలిపారు.
ఐటీతో మిగతా రంగాల్లోనూ వృద్ధి
ఐటీ రంగం వృద్ధి మిగతా రంగాలపైనా సానుకూల ప్రభావం చూపుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ రంగం వృద్ధితో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధి సాధించిందని, 2014లో రాయదుర్గాన్ని.. ప్రస్తుతం ఉన్న రాయదుర్గంతో పోల్చుకొంటే ఆ మార్పు తెలిసిపోతుందని చెప్పారు. ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరం చుట్టూ ఉన్న అవుటర్ రింగు రోడ్డు మీదుగా వస్తుంటే హైదరాబాద్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు.
స్థిరమైన ప్రభుత్వం.. సమర్థ నాయకత్వం
తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టానికి పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణం సీఎం కేసీఆర్ పాలన అని స్పష్టం చేశారు. రాజకీయంగానూ సుస్థిర ప్రభుత్వం, నాయకత్వానికి ఆ చతురత, దక్షత ఉంటేనే పెట్టుబడులతో ఎవరైనా ముందుకు వస్తారని తెలిపారు. దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. నిన్ననే దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో జరిగిందని, తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేసిన ప్రగతిని అద్భుతంగా ప్రదర్శించారని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు ఎన్ని రాష్ర్టాల్లో జరిగాయి? అని ప్రశ్నించారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ లెజిస్లేషన్
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్‌తో కలిసి దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణలో సైబర్ క్రైమ్ లెజిస్లేషన్ను తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నదని చెప్పారు. త్వరలోనే దీనికి తుది రూపు తీసుకువచ్చి, అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తీసుకువచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు. ‘ఇదే విషయాన్ని ఢిల్లీలో ఒకసారి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చెబితే మాకు ఇవ్వండి.. దేశవ్యాప్తంగా మేం అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం అని అన్నార’ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
పెట్టుబడులతోనే ఉద్యోగావకాశాలు
కేంద్ర ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 52 లక్షలు అని, మొత్తం జనాభాలో 0.5 శాతం ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులతో కలుపుకొంటే ఆరు లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో 3 శాతానికిపైగా ఉన్నారని పేర్కొన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఎక్కడైనా చాలా కష్టమని వెల్లడించారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారానే ప్రైవేటు రంగంలో గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని స్పష్టం చేశారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను రూపొందించి అమలు చేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. దీంతో రాష్ట్రం వివిధ రంగాల్లో పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని స్పష్టం చేశారు.
కేంద్రం లెక్కలతోనే ఐటీ వార్షిక నివేదిక
తెలంగాణ ఐటీ రంగం వృద్ధి చెందుతున్న తీరును రాష్ట్ర ప్రభుత్వమే కాదు.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు పర్యవేక్షిస్తుంటాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎస్టీపీఐ (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా అందించిన లెక్కలతోనే తాజా 2022-23 వార్షిక నివేదికను రూపొందించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును కొనసాగించడమే కాకుండా జాతీయ సగటును మించి.. ఆవిష్కరణలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా తన స్థానాన్ని పదిలపరుచుకొన్నదని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. కానీ, ఇప్పుడు దేశ ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. ఇందుకు 2022-23 వార్షిక నివేదికే నిలువెత్తు నిదర్శనం.
-కేటీఆర్
కేంద్రం వివక్షచూపినా అద్భుత ప్రగతి
రాష్ట్ర సర్కారు విశేష కృషి ఫలితంగానే తెలంగాణ ఐటీ రంగంలో విప్లవాత్మక ప్రగతి సాధ్యమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర సర్కారు సహాయనిరాకరణ చేసినా.. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించగలిగామని చెప్పారు. వాస్తవానికి 2035 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.50 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా ఐటీఐఆర్ రూపొందించారని, హైదరాబాద్ ఐటీ రంగానికి ఎంతగానో ఊతమిస్తుందనుకున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసినా.. పుష్కరకాలం ముందే ఆ లక్ష్యాన్ని సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. దీంతోపాటు దాదాపు రెండేండ్లు కరోనా సంక్షోభం, ఆ తర్వాత పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధిని సాధించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లోనూ జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకుపోతున్నదని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో నగరాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ విశ్వనగరం
దేశంలో హైదరాబాద్ అనేది ఒక మెట్రో నగరం మాత్రమే కాదని.. ఇప్పుడు అది విశ్వనగరంగా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చాలా ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో పర్యటిస్తుంటే తాను న్యూయార్క్‌లో ఉన్నానా? లేక హైదరాబాద్‌లో ఉన్నానా? అనేది పోల్చుకోలేకపోయానని సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్న మాటలను గుర్తుచేశారు. ‘రజనీకాంత్ దేశ, విదేశాలు తిరిగారు. ఎంతో అనుభవం ఉంది. ప్రత్యక్షంగా చూసిన తర్వాతే హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని, నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్టు తెలిపారు.
Capture