Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు పలువురు శాఖాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో రైల్ మాస్టర్‌ప్లాన్‌పై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మెట్రో రైలు మొదటి దశను అనేక సవాళ్లను దాటుకొని విజయవంతంగా పూర్తి చేశామని, ఆ అనుభవాలతో భవిష్యత్తు ప్రాజెక్టులను మరింత వేగంగా పూర్తి చేసే సామర్థ్యం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని, ఆ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వనగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రజా రవా ణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.
ఒకవైపు మెట్రో రైల్ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తూనే, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను పెంచాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్‌లను ప్రారంభించాలని చెప్పారు. అప్పుడు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్టు అథారిటీ వర్గాలు వెంటనే 48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపోకు కేటాయించాలని మంత్రి ఆదేశించారు. ఆ భూమిని వెంటనే మెట్రో వర్గాలకు అందించాలన్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు రూ.9,100 కోట్ల అంచనా వ్యయంతో విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని తెలిపారు. దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
మెట్రో లైన్‌ని భారీగా విస్తరించాలనుకుంటున్న మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక నివేదికలను, ఆ తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)లను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధుల సేకరణకు ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఆర్థిక, పురపాలకశాఖ అధికారులకు సూచించారు. మెట్రో విస్తరణలో భాగంగా స్టేషన్లతోపాటు భారీ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ జాగలను గుర్తించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కేటీఆర్ ఆదేశించారు. సమీక్ష ఆనంతరం ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతూ.. పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని మంత్రి చెప్పారు. మహాత్మగాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మెట్రో అధికారులకు సూచించారు.