హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)/కోల్‌సిటీ: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రముఖ కవయిత్రి తుమ్మల కల్పనారెడ్డి సీఎం కేసీఆర్‌పై ‘కట్లపూల దడి’ పేరుతో రాసిన కవితా సంపుటిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ సంపుటిని ఆవిష్కరించారు. స్త్రీ, పురుష సంబంధాల్లోని అసమానతలను పదునుగా ప్రశ్నించే కవితలు, తెలంగాణ తనను తాను పునరావిష్కరించుకుంటూ పునర్నిర్మించుకుంటున్న ప్రస్థానానికి అద్దం పట్టే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ ఆమెను అభినందించారు. తెలంగాణ నుడికారపు సొంపు, ప్రతి కవితలోనూ ప్రతిఫలిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ జీవితాన్ని సప్తవర్ణ శోభితం చేస్తున్న సీఎం కేసీఆర్‌పై కవితా సంపుటిని తీసుకొచ్చినట్టు కల్పనారెడ్డి తెలిపారు. తెలంగాణ సాధకుడు, సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో కొంతకాలంగా ఆమె తెలంగాణ యాసలో అనేక రచనలు చేస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్‌రెడ్డి, ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.