నారాయణపేట : నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజేందర్ రెడ్డి గొప్ప ఎమ్మెల్యే అని కొనియాడారు. సమర్థత, దక్షత కలిగిన నాయకుడు అని ప్రశసించారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
రూ. 81 కోట్ల 94 లక్షల 45 వేలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు.ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పారు. అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రూ. కోటి 68 లక్షలతో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. రూ. కోటి 35 లక్షలతో నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభించుకున్నాం. కొన్ని పార్కులు కూడా ప్రారంభించుకున్నాం. బంగారం మార్కెట్‌ను ఆధునీకరిస్తూ రూ. 20 కోట్లతో గోల్డ్ సూప్‌కు శంకుస్థాపన చేశాం. సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దీన్ని తయారు చేస్తామన్నారు. రూ. 2 కోట్లతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ. 6 కోట్ల 65 లక్షలతో మినీ స్టేడియానికి శంకుస్తాపన చేశాం. మరో రూ. 4 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రజకుల కోసం ఆధునీకమైన దోబీ ఘాట్ రూ. కోటితో శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. చిన్న పిల్లల ఆస్పత్రి సమీపంలో మున్సిపల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశాం. 12 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశాం. కొండారెడ్డిపల్లి చెరువును రూ. 4 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతాం. వచ్చే వినాయక చవితి నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లా కేంద్రాల్లోనే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా మెట్ల బావి వద్ద వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు.
ఒక చైల్డ్ హోంను రూ. 87 లక్షల 45 వేలతో నిర్మాణం చేసి, సంవత్సర లోపల అందుబాటులోకి తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు.