హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాజకీయ నాయకులపై ఆర్థిక నేరాలు మోపి, వారిని బలవంతంగా బీజేపీలో చేర్చుకోవడాన్ని ఎద్దేవా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రదర్శించిన వాషింగ్ పౌడర్ నిర్మా క్లిప్పింగ్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. బీజేపీ కండువా కప్పుకోగానే 64 చెట్ల పసరు తాగి పవిత్రం అయినట్టుగా చేస్తున్నారని, వారిపై విచారణ ఎందుకు కొనసాగించడం లేదని సీఎం నిలదీశారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కూడా దీనిపై స్పందిస్తూ.. సోమవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘వాషింగ్ పౌడర్ నిర్మా 1980-1990లో ఫేవరెట్ జింగిల్ (టెలివిజన్ లేదా రేడియో ప్రకటనల్లో ఉపయోగించే ట్యూన్ లేదా పాట) జ్ఞాపకాల్లో ఒకటి. అయితే దానికి ఈ కొత్త ట్విస్ట్ నవ్వు తెప్పిస్తుంది’ అని ట్వీట్ చేశారు.