Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్ ఆధ్వర్యంలో జూలై 21న నిర్వహించింది. వేలాది మంది తరలిరాగా అందులో నైపుణ్యం కలిగిన వారిని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.
నగరంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్‌కు ఆనుకొని నిర్మితమైన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్‌కు జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందుకోసం రూ.6.15కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఏసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఉండగా, జగిత్యాల జిల్లాలోనూ ఎన్ఏసీ కేంద్రం ఉన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఈ ప్రాంత యువతీ, యువకుల మేలు కోసం ఎన్ఏసీని నెలకొల్పారు. ఇందులో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఐదు స్మార్ట్ క్లాస్ గదులు, మూడు ప్రయోగశాలలు, 1 కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృహం, 1 కౌన్సిలింగ్ గది, 1 ప్లేస్మెంట్ రూమ్, 8 కార్యాలయ గదులను నిర్మించారు. చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న వారందరికీ ఎన్ఏసీ చుక్కానిగా నిలువనుంది. మేసన్ జనరల్, అసిస్టెంట్ బార్ బెండర్ అండ్ స్టీల్ ఫిక్చర్, షట్టరింగ్ కార్పెంటరీ, కన్స్ట్రక్షన్ పెయింటర్ అండ్ డెకొరేటర్, అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రై వాల్ అండ్ ఫాల్స్ – సీలింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, ప్లంబర్(జనరల్), అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ సూపర్వైజర్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్, సూపర్వైజర్ స్ట్రక్చర్, టైలరింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. భవన నిర్మాణాన్ని జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. ప్రతి ఫ్లోర్ 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా మొత్తం 37,557 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.