హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ వాసరత్వ రాజకీయాలపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియమ నిబంధనలు, బోధనలు ఇతరులకు చెప్పేందుకేనా? అవి మీకు వర్తించవా అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. ‘మీరు బీజేపీలో ఉంటే నీతిమంతులు, మీకు అవినీతి, వారసత్వ రాజకీయాలు వర్తించవు. అవన్నీ ఇతర పార్టీలకు మాత్రమే వర్తిస్తాయి’ అని గురువారం ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ సహా ఆ పార్టీ నేతలంతా దేశవ్యాప్తంగా తిరుగుతూ వారసత్వ రాజకీయాలనుంచి దేశానికి విముక్తి కలిగించాలంటూ ఉపన్యాసాలిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్విట్టర్ ద్వారా బీజేపీ వారసత్వ రాజకీయాలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘నేను జై షా, మరోసారి బీసీసీఐ కార్యదర్శి అవుతున్నాను. మా నాన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా’. ‘నేను అరుణ్ సింగ్ ధుమాల్, ఐపీఎల్ కొత్త చైర్మన్‌ను. నా పెద్దన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి’ అని పేర్కొంటూ వారసత్వ రాజకీయాల ముక్త్ బీజేపీకి మేము వారసులం’ అని ఓబ్రెయిన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ డైనాస్ట్స్ క్లబ్ అంటూ బీజేపీ నేతలు, వారి వారసులతో కూడిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ వారసత్వ రాజకీయాలపై బీజేపీ వైఖరిని తనదైన శైలిలో విమర్శించారు. బీజేపీ పదేపదే వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతూ తమ పార్టీలోని రాజకీయ వారసులను గురించి విస్మరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు.