తెలంగాణ ఆర్థిక చోదకశక్తి హైదరాబాద్. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నది. ఇటువంటి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుంది.
– మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్లుగా వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న తెలంగాణను కసాయి చేతిలో పెట్టొద్దని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. నిత్యం పదవుల కోసం కొట్లాడుకునే పార్టీలు అభివృద్ధి చేయలేవని, కుర్చీలు కాపాడుకోవడానికే వారికి సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోని సుస్థిర ప్రభుత్వం, సమర్థనాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. తెలంగాణ భవిష్యత్‌కు అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వేర్వేరుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంతోపాటు ‘దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ)’ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఒకబ్రాండ్ ఇమేజ్ ఉన్నదని, ఇక్కడ శాంతిభద్రతలు బాగుంటాయని, కులం పేరిట కుంపట్లు, మతం పేరిట మంటలు, ప్రాంతం పేరిట పంచాయితీలు పెట్టరన్న నమ్మకంతోనే గుజరాతీలు, ఇతర దేశాలవారు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని వివరించారు. అందుకే ఇక్కడ సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు. ‘అభివృద్ధి మా కులం, సంక్షేమమే మా మతం’ అనే స్ఫూర్తితో ముందుకుసాగుతున్నామని చెప్పారు.
రెండున్నరేండ్లు కరోనా, మూడుసార్లు ఎన్నికలతో మరో ఏడాది పోగా.. నికరంగా ఆరున్నరేండ్లు మాత్రమే పనిచేయగలిగామని కేటీఆర్ వివరించారు. కరోనా వల్ల రెండేండ్లు వృథా అయి రాష్ట్రం రూ.లక్ష కోట్లు నష్టపోయిన కష్టకాలంలోనూ హైదరాబాద్‌లో రోడ్లు వేశామని చెప్పారు. ఆరున్నరేండ్ల ప్రభుత్వ పనితీరు మీ ముందు ఉన్నదని, 65 ఏండ్ల పాలకులు ఏమి చేశారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలు ఏమో కానీ.. ఆరు నెలలకో సీఎం గ్యారెంటీ. రాహుల్‌గాంధీ, మోదీకి 29 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి మాత్రమే. వారు తెలంగాణను గెలవాలని అనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం.
– మంత్రి కేటీఆర్
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే గుర్తొస్తారని కేటీఆర్ చెప్పారు. ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అనేవి చంద్రబాబు మాడల్ అని, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేవి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ మాడల్ అని మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచంలోనే తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని తెలిపారు. ఢిల్లీలో అడగాల్సిన అక్కర్లేకుండా గల్లీలోనే ఉండి నిర్ణయాలు తీసుకుని ఆమలు చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఈ అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ ప్రగతి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని పేర్కొన్నారు.
కర్ణాటక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. 40% కమీషన్ అని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపితే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు రూ.400 వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అన్యాయం చేశామని కర్ణాటక రైతులు ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నారని వివరించారు. కర్ణాటకలో దీపావళి పండగ రోజు కరెంట్ లేదని, వెలుగుల పండగను చీకట్లో చేసుకున్నామంటూ అక్కడి ప్రజలే సోషల్ మీడియాలో ఆవేదన చెందారని గుర్తుచేశారు. ఇటువంటప్పుడు కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ రిజక్ట్ అయిన జానారెడ్డి సహా కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థేనని, ఆ పార్టీలో 11 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
తెల్లారి లేస్తే పంచాయతీలు, కీచులాటలు, పదవుల కోసం కొట్లాటలు, కుర్చీలను కాపాడుకోవడానికి సమయం సరిపోకపోతే.. ఆ పార్టీలు మన కోసం ఎప్పుడు పని చేస్తారో ఆలోచించాలి. స్థిరమైన ప్రభుత్వం, ధృడమైన నాయకత్వం రాష్ర్టానికి అవసరం. ప్రగతి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
– మంత్రి కేటీఆర్
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్‌లో భూముల ధరలు పడిపోతాయంటూ ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని, కానీ నేడు హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా 10 నుంచి 20% రెట్లు పెరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. భూముల విలువ పెరగడంతో రైతుల్లో ధీమా వచ్చిందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.
ఇవి తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. బీఆర్ఎస్ది చేతల ప్రభుత్వం. ఎవరి చేతిలో రాష్ర్టాన్ని పెట్టాలో ఆలోచించకపోతే ప్రజలే నష్టపోతారు. అందరూ ఆలోచించి ఓటెయ్యాలి.
– మంత్రి కేటీఆర్
నీళ్లు, నిధులు, నియమకాలు అనే ఉద్యమ ట్యాగ్‌లైన్‌తో ఏర్పడిన తెలంగాణలో తొలి ప్రాధాన్యంగా ఇరిగేషన్, విద్యుత్తు రంగంపై దృష్టి పెట్టామని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-ఎత్తిపోతల పథకంతోపాటు చిన్న, చిన్న ప్రాజెక్టులు కలిపి రూ.లక్షా 85 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, విద్యుత్తురంగంలో అదే స్థాయి విజయాలు సాధించామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ రంగంలో 3.20 లక్షల ఉద్యోగాలు ఉంటే నేడు 10 లక్షలకు చేరువ అయ్యాయని తెలిపారు. 1989లో బేగంపేటలో ఐటీ కంపెనీ ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు 25 ఏండ్లలో ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు ఉంటే 2022-23 ఒక్క సంవత్సరంలోనే రూ.57 వేల కోట్లకు చేరిందని వివరించారు. హైదరాబాద్ నగరం గడిచిన రెండేండ్లుగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగుళూరు దాటిందని వెల్లడించారు. సమావేశంలో టీబీఎఫ్ ప్రతినిధులు జక్కా వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, గోపాల్‌రావు, జంట నగరాల బిల్డర్లు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని, చేనేతమిత్ర పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గత నెల చేనేతమిత్ర డబ్బులు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ అనుమతి కోరామని, రెండు, మూడురోజుల్లో ఆ డబ్బులు అకౌంట్లలో జమచేస్తామని చెప్పారు. వరంగల్‌లో బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్కు పెట్టుకున్నామని, భవిష్యత్‌లో గద్వాల, దుబ్బాక, నారాయణపేట, మునుగోడుతోపాటు మరికొన్నిచోట్ల టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నాగోల్‌లో నిర్వహించిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. నేతన్నల ఆత్మహత్యలకు అసమర్థ కాంగ్రెస్ విధానాలే కారణమని మండిపడ్డారు. వీటన్నింటికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. మనకంటే ఎకరం ఎక్కువ ఉంటే.. రైతుబంధు కూడా ఎక్కువే వస్తదని, మరి దానికి అక్కసు పడటం సరికాదని చెప్పారు. పదేండ్లలోనే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర వన్ స్థాయికి ఎదిగిందని, ఇంత సంపదను సృష్టించింది కేసీఆరేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ.. చేనేతల కోసం ఎప్పుడూ కేసీఆర్ పరితపిస్తూ ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పద్మశ్రీ గోవర్దన్, మండల శ్రీరాములు, మార్కండేయ, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ సత్యప్రసాద్, సిరిసిల్ల సెస్ డైరెక్టర్ లక్ష్మన్న, కర్ణాటి శ్రీనివాస్, సుధాకర్, శ్రీధర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏ దేశంలోనైనా అట్టడుగువర్గాల ప్రజల కోసం, సకలవర్గాల మేలు కోసం దమ్మున్న పనులు చేసేవారు నిజమైన నాయకులవుతారు. వారే చరిత్ర పుటల్లో చెరగని సంతకమవుతారు. అలాంటి దమ్మున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ది చెరగని సంతకం.
– మంత్రి కేటీఆర్
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితుల గురించి ఆలోచించింది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనని, దళితబంధు వంటి పథకాలను ఓట్ల కోసం తీసుకురాలేదని, అట్టగున ఉన్న దళిత సామాజికవర్గాన్ని అందలం ఎక్కిచేందుకు మాత్రమే తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతోపాటు దళిత సమాజాభివృద్ధి కోసం తెలంగాణను ప్రయోగశాలగా, మన రాష్ర్టాన్ని దళిత క్యాపిటల్ సెంటర్‌గా మార్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని హామీ ఇచ్చారు. డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సీడీపీ, టీప్రైడ్, డిక్కీ వంటి వేదికల ద్వారా ఎంతోమంది అణగారినవర్గాలకు చెందినవారు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని వివరించారు. ఒక్కో దళిత ఆంత్రప్రెన్యూర్ విజయగాథ వింటుంటే గర్వంగా ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో దాసరి అరుణ, కే రవికుమార్, జే సీతారాం, దాసరి నారాయణ, సురేశ్‌నాయక్, మున్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువ దళిత పారిశ్రామికవేత్తలు తమ విజయగాథలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ దేశానికే ఆదర్శం. దళిత సమాజాభివృద్ధికి బీఆర్ఎస్ చేస్తున్న కృషిని అందరూ ఆమోదించాలి. డిక్కీకి కేటాయించిన 2.7 ఎకరాల్లో నిర్మించే దళిత్ క్యాపిటల్ సెంటర్‌కు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని చెప్పడం సంతోషకరం. దళితుల కోసం 9 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసింది. మంచి చేసిన పార్టీకి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం.
– పద్మశ్రీ నర్రా రవికుమార్, డిక్కీ అధ్యక్షుడు
ఇన్నాళ్లూ నేకొక దళితబిడ్డను అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారం, డిక్కీ ప్రోత్సాహంతో పారిశ్రామికవేత్తగా ఎదిగాను. పెట్గ్రూమ్ స్టార్టప్‌తో దాదాపు 40 కుటుంబాలకు ఉపాధి కల్పించగలిగాను. జాబ్సీకర్గా కాదు.. జాబ్మేకర్గా ఓ దళితబిడ్డనని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ వేదిక మీదనుంచి నేను బల్లగుద్ది చెప్తున్నా ఐయామ్ దళిత్. ప్రభుత్వ సహకారంతో ఎంతోమందికి ఉపాధి చూపించగలను. నా వెనుక ఉన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– చైత్ర, మహిళా ఆంత్రప్రెన్యూర్