‘మన జేబుల వంద రూపాయల నోటున్నది. మనం నడుచుకుంటా పోతుంటే రోడ్డుమీద చిల్లర పైసలు కనిపించినయి అనుకుందాం. వాటికోసం వంగితే.. జేబుల ఉన్న నోటు పడిపోతది. ఇక్కడ నోటేమో కేసీఆర్. చిల్లర పైసలు కాంగ్రెస్, బీజేపీ. నోటు జేబులో ఉన్నంత కాలం మనకు విలువ తెలువది. పోయినపుడే దాని విలువ తెలుస్తది. చిల్లర మాటలకు పడిపోతే ఆగమైతం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను ఓడించాలన్న కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే ఆగమైపోతామని ప్రజలను హెచ్చరించారు. ఖైరతాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, వారి అనుచరులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతున్నదని తెలిపారు. ‘స్కూళ్లలో పొద్దున్నే టిఫిన్ ప్రారంభించాం. మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. పిల్లలు రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత సన్నబియ్యం బువ్వ తినేలా అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. వండిపెట్టుడు, మూతి తుడుచుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తున్నది’ అని అన్నారు. ‘బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. అనుకోకుండా ఎవరైనా మరణిస్తే కేసీఆర్ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఇవ్వబోతున్నాం. పుట్టుక నుంచి చావుదాకా కేసీఆరే చూసుకోబోతున్నారు’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను మంచిగ చేసుకున్నం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ అభివృద్ధిపై చాలా అనుమానాలు ఉండేవని, తొమ్మిదిన్నరేండ్ల తర్వాత హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా ఎదుగుతున్నదని కేటీఆర్ అన్నారు. ప్రపచంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘సీఎం కేసీఆర్ పాలనలో కరెంటు మంచిగ చేసుకున్నం. గతంలో వారం పదిరోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి. ఖైరతాబాద్‌లో జలమండలి ముందు రోజూ ఖాళీ బిందెలతో ధర్నాలు అవుతుండే. ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చుకుంటున్నం’ అని గుర్తు చేశారు. గతంలో కరెంటు కోతలు విపరీతంగా ఉండేవని, ఇన్వర్టర్ లేని దుకాణం, జనరేటర్ల సౌండు, డీజిల్ కంపు కొట్టని అపార్ట్మెంట్లు ఉండేవి కావని తెలిపారు. ఇప్పుడు ఆ కష్టం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో గొడవలు, కొట్లాటలు అవుతాయని భయపెట్టారని, కానీ తొమ్మిదిన్నరేండ్లలో చిన్న గొడవ గానీ, ఘర్షణ గానీ లేకుండా ఒక్క రోజు కర్ఫ్యూ పెట్టే అవకాశం లేకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నామని పేర్కొన్నారు. ‘హుస్సేన్‌సాగర్ వైపు వెళ్తే ఏదో కొత్త నగరానికి వచ్చినట్టు అనిపిస్తున్నది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఆయన పేరే పెట్టుకున్న నూతన సచివాలయం, అమరుల స్థూపం వంటి నిర్మాణాలతో ఆ ప్రాంతం అద్భుతంగా మారింది. హైదరాబాద్‌లో ఇప్పుడు రోడ్లు బాగయ్యాయి. మోరీలు, పార్కులు బాగు చేసుకుంటున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి కండ్లు చెదిరే నిర్మాణాలను చూస్తే అమెరికాను తలపిస్తున్నది. హైదరాబాద్‌లో ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రతిరోజు నీళ్లు ఇచ్చేలా, ఆ తర్వాతి దశలో ఎప్పుడు నల్లా తిప్పినా నీళ్లు వచ్చేలా 24 గంటల నీటి సరఫరా చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల మేర మెట్రోలైన్ విస్తరించి ఉన్నదని, దీనిని 400 కిలోమీటర్లు చేయాలన్నది సీఎం కేసీఆర్ కల అని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీవాళ్లకే అర్థమైతలేదు
హైదరాబాద్ అభివృద్ధిని ఎంతో మంది పొగుడుతున్నా, ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. సినీ హీరో రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి.. ‘జూబ్లీహిల్స్, గచ్చిబౌలి దిక్కుపోతే న్యూయార్క్‌లో ఉన్నట్టు అనిపిస్తున్నది’ అని ప్రశంసించారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ, సినీనటుడు సన్నీ డియోల్ ‘హైదరాబాద్ ఎంతో అందంగా తయారయ్యింది. ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉండాలనిపిస్తున్నది’ అని చెప్పిట్టు తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ నటి లయ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చి ఆశ్చర్యపోయారని, ‘అమెరికాలోని పెద్దపెద్ద నగరాల కన్నా హైదరాబాదే బాగున్నది’ అని అన్నారని గుర్తుచేశారు. ‘సోషల్ మీడియాలో సుపరిచితురాలైన గంగవ్వ ఇటీవల దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఆమె నన్ను కలిసినప్పుడు దుబాయ్ నగరం ఎలా ఉన్నదని అడిగిన. ఏమున్నది.. మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది అని చెప్పింది. హైదరాబాద్ ఎంత అద్భుతంగా తయారైందో అందరికీ అర్థం అవుతున్నది. ఇక్కడే ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు మాత్రం అర్థం కావడం లేదు’ అని ఎద్దేవా చేశారు.
చిల్లర మాటలకు పడిపోతే ఆగమైతం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ పెరుగుతున్నదని, ఇక్కడ పనిచేసుకునే కార్మికులు, ఉద్యోగులు చల్లగా ఉంటున్నామని, శాంతి సామరస్యాలతో కలిసి మెలిసి జీవిస్తున్నామని కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేండ్లు అద్భుతంగా పాలన చేసిన సీఎం కేసీఆర్‌ను ఓడగొడతామని కొందరు వస్తున్నారని మండిపడ్డారు. ‘ఎందుకు ఓడగొట్టాలె అని వచ్చిన వాళ్లను అడగండి’ అని ప్రజలను కోరారు. ‘మన జేబుల వంద రూపాయల నోటున్నది. మనం నడుచుకుంటా పోతుంటే రోడ్డుమీద చిల్లర పైసలు కనిపించినయి అనుకుందాం. వాటికోసం వంగితే.. జేబుల ఉన్న నోటు పడిపోతది. ఇక్కడ నోటేమో కేసీఆర్. చిల్లర పైసలు కాంగ్రెస్, బీజేపీ. నోటు జేబులో ఉన్నంత కాలం మనకు విలువ తెలువది. మన దగ్గరనే ఉన్నది కదా అనుకుంటం. పోయినపుడే దాని విలువ తెలుస్తది. చిల్లర మాటలకు పడిపోతే ఆగమైతం. పెరుగుతున్న హైదరాబాద్ ఆగిపోతది. మల్లా కరెంటు కోతలు మొదలైతయ్. తాగునీటి గోస షురూ అయితది’ అని హెచ్చరించారు.
పేదల కోసం కొత్త పథకాలు..
మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించిన పథకాలను కేటీఆర్ వివరించారు.అన్నపూర్ణ: ‘తెలంగాణ ఏర్పడేనాటికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మీద సీలింగ్ ఉండేది. మనిషికి 5 కిలోల చొప్పున గరిష్ఠంగా ఇంటికి 20 కిలోలు మాత్రమే ఇచ్చేవారు. సీఎం కేసీఆర్ ఆ సీలింగ్‌ను ఎత్తివేయడమే కాకుండా మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత బియ్యం వస్తున్నాయి. ఈ సారి గెలిచిన తర్వాత ‘అన్నపూర్ణ’ పథకం కింద తెల్లకార్డు ఉన్న ప్రతి ఇంటికీ నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు’ అని చెప్పారు.
రూ.400కే సిలిండర్: ‘2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ పెద్దపెద్ద మాటలు చెప్పిండు. సిలిండర్ ధర కొండెక్కిందని, ఆడబిడ్డలకు కట్టెల పొయ్యే దిక్కైతున్నదని, మీకు పాలన చేతనైతలేదని మన్మోహన్సింగ్ను తిట్టిండు. ప్రధాని అయ్యిండు. మోదీ పుణ్యమా అని ఆనాడు రూ.400 ఉన్న సిలిండర్ పదేండ్లలో రూ.వెయ్యికి చేరింది. గ్యాస్ బండ పేదలపాలిట గుదిబండగా తయారైంది. డిసెంబర్ 3వ తేదీన మూడోసారి అధికారంలోకి రాగానే.. మోదీ పెంచిన భారాన్ని నేనే కడుతానని, ఆడబిడ్డలకు రూ.400కే సిలిండర్ ఇస్తానని సీఎం కేసీఆర్ అంటున్నడు’ అని పేర్కొన్నారు.
ఆసరా పెంపు: ‘ఆసరా పెన్షన్ ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ మళ్లీ గెలిచిన తర్వాత రూ.5 వేలు కాబోతున్నది’ అని తెలిపారు.
సౌభాగ్య లక్ష్మి: ‘ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేల చొప్పున ఇచ్చే పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయబోతున్నారు. దీంతో ఇంట్లో అత్తకు రూ.5 వేలు పెన్షన్, కోడలుకు రూ.3 వేలు రాబోతున్నాయి’ అని పేర్కొన్నారు.
లక్ష ఇండ్లు: ‘హైదరాబాద్‌లో గత టర్మ్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టినం. 70 వేలు పంపిణీ చేసినం. మూడో దఫాలో మరో లక్ష ఇండ్లు కట్టి పేదలకు ఇవ్వబోతున్నాం’ అని వెల్లడించారు. ఇప్పటికే జీవో 58, 59 కింద క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చామని, గృహలక్ష్మి కింద అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు.
కేసీఆర్ బీమా: ‘సీఎం కేసీఆర్ ఓసారి ఖమ్మం పోయినప్పుడు ఒక దళిత చెల్లెలు అడిగింది. అన్నా.. పొలం ఉన్నోళ్లకు రైతుబీమా ఇస్తున్నారు. మరి మాలాంటి పొలం లేనోళ్ల సంగతి ఏంది? అని. అప్పుడు మీ గురించి కూడా ఆలోచిస్తా అని సీఎం కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ బీమా అనే పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించబోతున్నాం’ అని వివరించారు.
బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి
సంపద పెంచాలె, పేదలకు పంచాలె, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనేదే కేసీఆర్ నినాదమని కేటీఆర్ చెప్పారు. ‘ఛూమంతర్ అంటే పేదరికం మాయం కావాలని మాకు కూడా ఉంటది. కానీ సాధ్యం కాదు కదా! అందుకే పిండికొద్దీ రొట్టె అన్నట్టుగా ఎట్లెట్ల సంపద పెరిగితే దానికి తగ్గట్టు పథకాలు రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పసిగుడ్డును కంటికి రెప్పలా కాపాడుకున్నట్టు సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని కాపాడుకుంటున్నారని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్కే ఓటేసి మరింత అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డాక్టర్ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మొత్తం కుటుంబం.. పెద్ద కేసీఆర్: గోవర్ధన్
గతంలో జై తెలంగాణ అంటే జైలులో వేసేవారని, ఇప్పుడు గర్వంగా జై తెలంగాణ అని నినదించేలా చేసింది సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్లో చేరిన పల్లపు గోవర్ధన్ అన్నారు. ‘ఇది మా భూమి.. మా రాష్ట్రం.. మేం గర్వంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుతున్నాం అని ప్రతి ఒక్కరూ చెప్పుకొనేలా చేశారు. చాలామంది సీఎం కేసీఆర్‌ను కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లో నేతలు ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడుతుంటే.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అటు పార్టీ పనులు, ఇటు ప్రభుత్వ పనులు, ఇప్పుడు ఎన్నికల పనులు చూసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలంతా వాళ్ల కుటుంబం. వాళ్లు పడే కష్టమంతా ఆ కుటుంబాన్ని పాలించడం కోసమే. ఆ కుటుంబం తలెత్తుకొనేలా చేయడం కోసమే అహర్నిషలు కృషి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. బీజేపీలో 22 ఏండ్లు పనిచేసినా తనకు ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు.