Minister KTR | సిద్దిపేట, జూన్ 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాలే నేడు పథకాలుగా అమలవుతున్నాయని, దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని స్పష్టం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ చేపట్టిన ఇంటింటా తాగునీరు.. మిషన్ భగీరథకు, దళిత చైతన్యజ్యోతి.. దళితబంధుకు, సిద్దిపేట హరితహారం తెలంగాణకు హరితహారం స్ఫూర్తి అని తెలిపారు. 1980ల్లోనే సిద్దిపేటలో అభివృద్ధి ఒరవడిని కేసీఆర్ చేపట్టారని వెల్లడించారు. హరితహారం కార్యక్రమాన్ని 1987-88లోనే ఇక్కడ ప్రారంభించారని గుర్తు చేశారు. గురువారం సిద్దిపేటలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఐటీ టవర్‌ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 14 కంపెనీలకు అలాట్మెంట్ ఆర్డర్లు, 714 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘2014లో రాష్ట్రం ఏర్పడ్డనాడు చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. మీకు పాలించటం వస్తదా? మీకు అంత తెలివి ఉన్నదా? మీకు నాయకులు ఉన్నారా? మీకు పాలించే సత్తా ఉన్నదా? అని చాలా చాలా మాట్లాడారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది’ అని అన్నారు. ఒక్క ఐటీ రంగం లెక్కలే చూసుకొంటే 2014లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.2,41,000 కోట్లకు పెరిగాయని వివరించారు. నాడు ఐటీ ఉద్యోగులు 3,23,000 మంది ఉంటే, ఇప్పుడు 9,05,000 మంది ఉన్నారని వెల్లడించారు. ‘ఇవాళ ఐటీ టవర్‌కు సమీపంలో ఉన్న బక్రిచెప్యాలకు చెందిన అమ్మాయి ఎంత సంబురపడింది. హరీశ్‌రావు ఏ ఊరు అమ్మాయి అని అడిగితే బక్రిచెప్యాల అని చెప్పింది. ఇదే ఊరులో పుట్టినవ్, ఇక్కడే చదువుకున్నవ్, ఇక్కడే ఐటీ హబ్‌లో ఉద్యోగం పొందావ్ అని హరీశ్ సంబురపడ్డారు’ అని తెలిపారు. ఇతర రాష్ర్టాలు అసూయపడేలా అభివృద్ధిలో ముందుకు పోతున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాలు.. ఇలా వేల ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టిస్తున్నదని అన్నారు. త్వరలో ఐటీ హబ్ విస్తరణకు సిద్దిపేటలో మరిన్ని వినూత్నమైన అభివృద్ధి ఆలోచనలు చేయడానికి మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఇలాగే ముందుకు సాగాలని, హరీశ్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌కు ఆశ్వీరాదం ఎల్లవేళలా ఉండాలని ప్రజలను కేటీఆర్ కోరారు.

ఇవాళ అసూయ పడేలా సిద్దిపేటను అభివృద్ధ్ది చేసి చూపెడుతున్న, అద్భుతమైన నాయకుడు మంత్రి హరీశ్‌రావు అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ‘సిరిసిల్లకు వెళ్లేటప్పుడు సిద్దిపేటకు రాగానే ఆయను ఫోన్ చేస్తా. బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా. సిద్దిపేటలో అది చేస్తున్నవ్. ఇది చేస్తున్నవ్. ఇంతింత పెద్ద రోడ్లు వేస్తున్నవ్ అని ఏడ్పిస్తూ ఉంటా’ అని అన్నారు. హరీశ్ తీసుకొచ్చిన స్వచ్ఛబడి అద్భుత కార్యక్రమం అని ప్రశంసించారు. పిల్లలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించడం బాగుందని కితాబిచ్చారు. మంత్రి హరీశ్ కోరినట్టు ఐటీ హబ్‌ను విస్తరిస్తామని, టాస్క్ ద్వారా మరింత మందికి శిక్షణ ఇస్తామని, టీహబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ మాడల్ ఏంటిదంటే.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత,సమతుల్య అభివృద్ధి అని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు వ్యవసాయం.. మరోవైపు ఐటీ ఎగుమతులు, ఒకవైపు పరిశ్రమలు.. మరోవైపు పార్కులు ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ.. పల్లె ప్రగతి రూపంలో దేశంలోని 30 శాతం అవార్డులను సొంతం చేసుకున్నదని చెప్పారు.
‘తెలంగాణకు ఒక నాయకుడిని మాత్రమే కాదు.. తెలంగాణకు జన్మనిచ్చింది, రాష్ర్టాన్నిచ్చింది.. సిద్దిపేట గడ్డ’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ కేసీఆర్ పుట్టకపోతే ఆ కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి, ఆ తర్వాత మంత్రిగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టకపోతే, ఇవ్వాళ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదని, ఉద్యమం లేకపోతే రాష్ట్రం లేదని, ఇక్కడ ఉన్న వాళ్లకు ఎవరికీ పదవులు లేవని తెలిపారు.

ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ గొప్పతనాన్ని అనర్గళంగా వివరిస్తూ, టీఎస్ఐపాస్ ద్వారా పలు ప్రముఖ ఐటీ కంపెనీలను తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్‌ను హరీశ్‌రావు కొనియాడారు. గతంలో ఐటీకి పెట్టింది పేరు బెంగళూరేనని, ఈ తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని ఐటీలో నెంబర్‌వన్‌గా నిలబెట్టిన ఘనత కేటీఆర్‌దేనని శ్లాఘించారు. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి రావాలని ఇతర రాష్ర్టాల వారు ట్విట్టర్లో అడుగుతుంటారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న తన కోరిక ఐటీ టవర్‌తో నెరవేరిందని హరీశ్ అన్నారు. 1,500 మందికి ఉద్యోగాలు రావటం గొప్ప విషయమని తెలిపారు. మందపల్లి వద్ద ఆటోనగర్ నిర్మించామని, త్వరలోనే అవి ప్రారంభించి మెకానిక్ కార్మికులకు అందజేస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటికే 2, 3 ఫ్యాక్టరీలు వచ్చాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్యాక్టరీలు సాధిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరాజనర్సు, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక యువత పాల్గొన్నారు.

తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అన్నంత గొప్పగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇతర రాష్ర్టాలవాళ్లు వచ్చి నేర్చుకొని పోతున్నారంటే ఇది తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ చూస్తున్న అభివృద్ధి మంత్రమేస్తే, మాటలు చెప్తే సాధ్యం కాలేదని.. కేసీఆర్ నాయకత్వంలో కష్టపడి పనిచేస్తేనే సాధ్యమైందని తెలిపారు. దేశానికే కాదు.. ప్రపంచానికే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీసుకొని పోదామని పిలుపునిచ్చారు. ‘నాడు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తామని అసెంబ్లీలో చెప్తే, ప్రతిపక్ష నేత జానారెడ్డి అలా జరిగితే చిత్రమే అన్నారు. కానీ ఈ రోజు ఎలా ఉన్నదో ప్రజలందికీ తెలుసు’ అని వివరించారు. నమ్మిన సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలు చేసే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంత క్రమశిక్షణతో పనిచేస్తారో, ఎంత పట్టుదలతో పని చేస్తారో, అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఎంత కృషి చేస్తారో సిద్దిపేట ప్రజలకే తెలుసని చెప్పారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటకు బలమైన పునాది వేశారని, దాన్ని తాను కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడ చదువుకున్న బిడ్డలు ఇక్కడే ఐటీ ఉద్యోగాలు చేయటం అద్భుతం అని తెలిపారు. నాడు కోమటి చెరువుకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తే, దాన్ని తాను విస్తరించినట్టు తెలిపారు. నాడు సిద్దిపేటకు రింగ్‌రోడ్డు తీసుకొస్తే, నేడు ఫోర్ లైన్ వేశామని అన్నారు. 30 ఏండ్ల కింద కేసీఆర్ సిద్దిపేటకు ఏం కావాలో ప్రణాళికలు వేశారని, నేడు ఆయన నాయకత్వంలో ఆ ప్రణాళికను నిజం చేసే అదృష్టం తనకు దక్కిందని వెల్లడించారు.
ఎన్నికలు ఎప్పడొచ్చినా రాష్ట్రంలోనే అతి ఎక్కువ మెజారిటీతో హరీశ్‌రావును గెలిపిస్తారని నాకు, మీకు తెలుసు. కానీ, ఈసారి అన్ని రికార్డులు బద్దలు కావాలి. గత ఎన్నికల్లో 1.18 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి దానిని 1.50 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చే మీరే (ప్రజలు) బాధ్యత తీసుకోవాలి.
-కేటీఆర్