హైదరాబాద్: సమంతా, నాగచైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విచారం వ్యక్తం చేశారు. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదన్నారు. నా నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందని చెప్పారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని తెలిపారు. తనకు జరిగిన అవమానం మరొకరికి జరగొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాని వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. లీగల్ నోటీసులపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
అంతకు ముందుకు తాన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమంతకు ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.’ అంటూ సురేఖ ట్వీట్ చేశారు.