హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రాట్యుటీ పెంపుతోపాటు, పెన్షన్ స్కీమ్, ఇన్సూరెన్స్‌కు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలపై అర్చక, ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే సోమవారం మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు తదితర అధికారులతో కలిసి అర్చక, సంక్షేమనిధి పోస్టర్‌ను ఆమె రిలీజ్ చేయగా, ఈ పోస్టర్లో అవి లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ తీర్మానాలే కాకుండా బోర్డుమెంబర్లు ఆమోదం తెలిపిన కుమార అధ్యాపక, వృద్ధ పండితుల, విధవ పోషక, వేద పాఠశాల పథకాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తెలుస్తోంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాల్లో ఒక్క గ్రాట్యుటీ, అంతిమ సంస్కారాల ఖర్చుల పెంపు తప్ప.. మిగతావన్నీ గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నవేనని అర్చక సంక్షేమ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తే ఆ ఊసేలేదని, తాము అడిగితే వివరాల సేకరణలో ఉన్నామని చెప్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదేకాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన రుణాలను ట్రస్ట్ఫండ్ నుంచి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటీ పథకానికి నిరుడు చెల్లించిన రూ.4లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారు. ఈ గ్రాట్యుటీ మొత్తం సదరు ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఒకేసారి వారి సర్వీస్ కాలాన్ని బట్టి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా అకాల మరణం చెందితే, వారి అంతిమ సంస్కారాల ఖర్చుల కోసం ఇప్పటి వరకు ఇచ్చిన రూ.20వేలను రూ.30వేలకు పెంచినట్టు పేర్కొన్నారు.