హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తాము ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ మాట మార్చారు. రెండు రోజుల క్రితం సన్న వడ్లకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు మీడియాకు వెల్లడించిన మంత్రుల బృందంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు కోమటిరెడ్డి కూడా ఉన్నారు. ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం మాటతప్పడం కాదా? అని అదే సమావేశంలో మీడియా ప్రశ్నించింది. అప్పుడు సమాధానం దాట వేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. గురువారం మీడియాతో మాట్లాడుతూ, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదని అన్నారు.
ప్రభుత్వ దవాఖానల భవనాలు 14 అంతస్థులకు మించరాదని నిబంధనలు ఉన్నాయని, కానీ 27 అంతస్థులతో టిమ్స్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. మున్సిపాలిటీల నుంచి అనుమతులు లేకుండానే జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించారని విమర్శించారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని పేర్కొన్నారు. వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ కోసం వివిధ కంపెనీలతో భేటీ కానున్నట్టు తెలిపారు.