హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను (N-Convention) హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు లేఖ రాశారు. కన్వెన్షన్ ఆక్రమణల వివరాలతోపాటు ఆధారలు, శాటిలైట్ చిత్రాలను అందించారు. మంత్రి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. అయితే మంత్రి ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే నిర్మాణాన్ని కూల్చివేయడం గమనార్హం.
కాగా, తుమ్మిడికుండ ఎఫ్టీఎల్ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు ఉండగా, ఎఫ్టీఎల్ పరిధిలో 2014లో 2.39 ఎకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఆరేండ్లు గడిచేసరికి అంటే 2020 నాటికి 4.69 ఎకరాల్లో అక్రమ కట్టడాల సంఖ్య 32కు చేరింది. అయితే చెరువు బఫర్‌జోన్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 2014లో 2.05 ఎకరాల బఫర్‌జోన్‌లో 23 అక్రమ కట్టడాల నిర్మాణం జరుగగా, 2020లో 5.02 ఎకరాల బఫర్‌జోన్‌లో 81 అక్రమకట్టడాలు వెలిశాయి.