నాగర్ కర్నూల్ : ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు పారదర్శకమైన పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) అన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలు హర్షించే విధంగా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎమ్మెల్సీలు కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ శాంత కుమారి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు -రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 31 లోగా గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.