మొన్న రాష్ట్రంలో మద్యం కొరత లేనే లేదన్నారు. ఇప్పుడు కొరత ఉన్నందునే కొత్త కంపెనీలకు గేట్లెత్తామని చెప్పారు. కొత్త బ్రాండ్లు వస్తున్నాయన్నది తప్పుడు ప్రచారమేనని మొదట అన్నారు. డిమాండ్ మేరకే కొత్త మద్యం బ్రాండ్లు తెస్తున్నామని ప్రకటించారు.మొన్న కొత్త కంపెనీల నుంచి తమకు దరఖాస్తులేవీ రాలేవన్నారు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది బేవరేజెస్ కార్పొరేషనే తప్ప తాను కాదన్నారు..
ఇదీ ఎక్సైజ్ మంత్రి జూపల్లి మాటమార్చిన తీరు!
కొత్త మద్యం కంపెనీల నుంచి దరఖాస్తులేవీ రాలేదని ప్రకటించిన మంత్రి.. వారం తిరక్కముందే తన ప్రకటనలపై తానే మాట మార్చారు. దరఖాస్తులు వచ్చాయేమో, బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నదేమోనంటూ నీళ్లు నమిలారు. ‘సోం’ డిస్టిలరీ చాలా పేరున్న కంపెనీ అంటూ.. దానిని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నియమ నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్తోపాటు మరికొన్ని కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. కొత్త మద్యం కంపెనీలకు అనుమతుల ఫైల్ తన వద్దకు రాలేదని, నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఉన్నదని తెలిపారు. ఆ మేరకే సోం డిస్టిలరీస్‌కు అమమతినిచ్చారని మంత్రి వెల్లడించారు.
బేవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోల్‌సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్-సప్లయ్‌ను బట్టి కొత్త కంపనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. రెండు దశాబ్దాలుగా సోం డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నదని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఎంఎఫ్ఎల్ సరఫరాదారుగా ఉన్నదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో నాలుగు సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి తన ప్రకటనలో గుర్తు చేశారు. 2020-2021 సంవత్సరంలో 50 లికర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021-2022లో 75 లికర్, 8 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2022-2023లో 122 లికర్, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023-2024లో 41 లికర్, 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. గతంలో అనుసరించిన విధానం ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని.. దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్త పత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని ఆరోపించారు. మొత్తం ఐఎంఎఫ్ఎల్/బీర్ల తయారీ, సప్లయ్ చైన్ 97.44శాతం విదేశీ కంపెనీలే ఆక్రమించాయని పేర్కొన్నారు. మన దేశానికే చెందిన సోం డిస్టిలరీకి మద్యం సరఫరాకు అనుమతులు ఇయ్యడాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అసంబద్ధమైన దుష్ప్రచారాలను మానుకోవాలని కోరారు.