హైదరాబాద్ : సమష్టి కృషితో విద్యుత్ రంగంలో అద్భుత విజయాలు సాధించామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. తెలంగాణ రాక ముందు, తరువాత పరిస్థితులను వివరిస్తే నేటి తరానికి కరెంట్ కోతలు(Power cuts) తెలియవని పేర్కొన్నారు. తెలంగాణా స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలోని టీఎస్ జెన్కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం సాధించిన తొలివిజయం ప్రస్తుతం దేశానికే రోల్ మోడల్ (Role model) గా మారిందన్నారు. అన్నం విలువ అమ్మ విలువ లేనప్పుడే తెలుస్తోందన్నారు.రాష్ట్ర సాధన కోసం నిబద్దతో పోరాటం చేయడమే కాకుండా వచ్చిన తెలంగాణలో విశ్వసనీయతతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదని వెల్లడించారు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరుగులు పెట్టించారని కొనియాడారు.
మంచినీళ్ల కోసం బారెడు దూరం పోకుండా ఇంటింటికి మంచినీరు, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ(Mission Kakatiya) పథకంతో చెరువుల పూడిక తీతలతో సస్యశ్యామలంగా మారిన పంట పొలాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు. అన్నింటికీ మించి యావత్ భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినిమయంలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆరోపణలు సూర్యుడి మీద ఉమ్మేసిన చందంగా మారాయని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీ డీసీఎల్ సీఎండీ డి రఘుమా రెడ్డి, ఎన్పీ డీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబా, జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బీసీరెడ్డి,వైస్ చైర్మన్ వజీర్,, శ్యామ్ సుందర్, తులసీ నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.