సూర్యాపేట: ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తెలిపారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో సత్యసాయి ధ్యానమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా (Yoga) శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భూమండలంలో అన్ని జీవులు ప్రకృతి (Nature) పరిరక్షణకు తాపత్రయ పడుతున్నాయని, దానికివిరుద్ధంగా మానవుడు మాత్రం ప్రకృతిపై అన్ని వైపులా దాడులు చేసి తనకు తాను అంతరించే పరిస్థితులు ఉత్పన్నం చేసుకుఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా సృష్టిలో ఏ జీవికి లేని అహం మనిషిని అవరించిందన్నారు.
అన్నీ తమకే తెలుసంటూ అహంతో మానవుడు చివరఖారికి దారితప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్యలు కూడ ఒక్క మానవ జీవితానికే ఆవరించడం బాధా కరమన్నారు. అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయట పడేందుకు యోగా ఉపకరిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మానవుడు సంఘ జీవీలా కొనసాగితే ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవొచ్చని వెల్లడించారు.