సూర్యాపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన గవర్నర్ తమిళిసై ఆ పదవికి అనర్హురాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీల ఫైల్‌ను వెన క్కి పంపడం ద్వారా గవర్నర్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని మంగళవారం సూర్యాపేటలో మీడియాకు వెల్లడించారు.
గవర్నర్ చెప్తున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని పేర్కొన్నారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ తమిళనాడు చీఫ్‌గా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. గవర్నర్ పదవి ప్రకటనకు ముందు రోజే ఆ పార్టీ పదవికి రాజీనామా చేసిన తమిళిసై నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటాననడం విడ్డూరంగా ఉన్నదని ఆక్షేపించారు.