హైదరాబాద్ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్ధిగా పండుతున్నాయన్నారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.