హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఒక సమాజం అభివృద్ధిని ప్రతిబింబించే కొలమానాల్లో ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఒక దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. సాధారణ వైద్యం చేయించుకొనేవారు కూడా ఆధునిక వైద్యం వైపు మళ్లుతారు. ఈ పరిణామాలు అక్కడ మాతృ మరణాల రేటును, శిశు మరణాల రేటును తగ్గించి సమాజంలో ఆరోగ్య సుస్థిరతను నెలకొల్పుతాయి. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా ఇదే జరుగుతున్నది. ఎనిమిదేండ్లలోనే ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది. ఆరోగ్య రంగంలో అత్యంత కీలకంగా భావించే మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధించిందని ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యరంగం ప్రస్థానంపై ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.
ఎంఎంఆర్, ఐఎంఆర్‌లో భారీ తగ్గుదల
రాష్ట్రంలో 2012-14 మధ్య 92 ఉన్న ఎంఎంఆర్, 2021 నాటికి 43కు పడిపోయింది. ఎంఎంఆర్ అంటే ప్రతి లక్ష మందిలో ప్రసవ సమయంలో చనిపోయే తల్లుల సంఖ్య. అలాగే, రాష్ట్రంలో 2014లో ఐఎంఆర్ 39 ఉండగా, 2020 నాటికి 21కి తగ్గిందని హరీశ్‌రావు తెలిపారు. ఐఎంఆర్ అంటే ప్రతి వెయ్యి సజీవ జననాల్లో ఏడాదిలోపు చనిపోతున్న శిశువుల సంఖ్య. ఈ రెండింటిలోనూ దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌తోపాటు, పటిష్ట చర్యలు చేపట్టడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 65 శాతానికి పెరిగాయి. 2014లో ఇది 30 శాతం మాత్రమే ఉండేది. అత్యంత వెనుకబడిన జాతులకు కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ వర్గం ప్రజలకు 2014కు ముందు 30 శాతం మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉండేది. 2020 నాటికి 55 శాతం మంది అత్యంత వెనుకబడి, సంచార జాతుల ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చారని మంత్రి హరీశ్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.