(Harish Rao coments) సిద్దిపేట: రైతులు పండించిన పంటలు కొనేలా, రైతులను ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని కొమురవెళ్లి మల్లన్నను కోరుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రద్దు చేసిన చట్టాలను మరో రూపంలో తీసుకోస్తామని చెప్పడం సరికాదన్నారు. ఏడాది పాటు రైతులంతా పోరాటం చేసి రద్దు చేయిస్తే.. తిరిగి ఆ నల్ల చట్టాలను తెస్తామని తోమర్ మాట్లాడటం యావత్ దేశ రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఒకవైపు ప్రకటించగా, తిరిగి ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి తోమర్ మరోవైపు చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎవరి మాట నమ్మాలో తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ రైతాంగంపై కక్ష్య గట్టిందని, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేశారమోనన్న అనుమానం వ్యక్తమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రంలో 50 టీఏంసీల సాగునీటి ప్రాజెక్టును మల్లన్న సాగర్ పేరిట పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కొమురెల్లి మల్లన్న దేవుడి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టులో కొన్ని నెలల క్రితం 10 టీఏంసీల నీళ్లు నింపుకున్నామన్నారు. కొమురవెళ్లి మల్లన్న దేవుడి దయతో సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకుని లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. గతేడాది ప్రాజెక్టు పూర్తి కావాలని మల్లన్న దేవుడిని మొక్కుకుని వెళ్ళామని, ఆయన దయతో ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఇప్పటికే 10 టీఏంసీల నీళ్లు తెచ్చుకున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశామని, 7 ఏండ్లలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. కొమురవెళ్లి మల్లన్నకు అద్భుతమైన బంగారు కిరీటం చేయించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంకల్పించారని, వచ్చే ఏడాది కల్యాణోత్సవానికి మల్లన్నకు బంగారు కిరీటం పెడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, కరోనాతో బయట పడి ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని మల్లన్న దేవుడిని కోరినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.